క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 1వ రంగము


1వ రంగము

(ఒక గదిలో డాక్టర్ గారికి కావలసిన పరికరములతో అమర్చుకొని, క్లినిక్ గా చూపించాలి. డాక్టరు సిల్లీగా ఉండి అందరినీ నవ్వించాలి)

డాక్టరు: (తెరతీయగానే) క్లినిక్ తెరచి రెండు గంటలైంది. ఇంతవరకు ఒక్క పేషెంట్ కూడా రాలేదు. ఈరోజు     ఎవరి ముఖము చూశానో ఏంటో.. అయినా ఈ మధ్య మా ఊళ్ళో ఎవరో ఒకాయన కొత్త భోధకుడు    ప్రార్ధనలు, గీర్ధనలని మొదలుపెట్టాడు. ఆయనగారు ప్రార్ధనలు చేస్తుంటే ఎంతోమంది రోగులు       బాగుపడిపోతున్నారంట. సరే నా దగ్గరకు వచ్చేవారు నాకు రాకుండా పోతారా? చూద్దాం చూద్దాం       (అని కనిపెట్టుచుండగా)

ఆగస్టీన్: (కడుపునొప్పితో బాధపడుచూ) అమ్మా, అయ్యా, నొప్పి, నొప్పి, కడుపునొప్పి.. అమ్మో       భరించలేకపోతున్నాను. (డాక్టర్ ని చూస్తూ) అయ్యా.. ఇక్కడ డాక్టర్ ఫటాఫట్ గారంటే ఎవరండి?

డాక్టరు: (కోపంతో) ఏమిటయ్యా చెట్టంత డాక్టరుని ముందు పెట్టుకుని డాక్టర్ ఫటాఫట్ గారెక్కడండి   అంటారేంటి? నేనే డాక్టర్ ఫటాఫట్ ని మన వైద్యానికి తిరుగులేదు. ఎలాంటి రోగమైన సరే చెప్పండి.   చిటికెలో మాయం. ఎంతో పెద్ద పెద్ద దేశనాయకులకు, సినిమా యాక్టర్లకు వైద్యం చేసిన చేతులివి.         వారు పైకిపోయారు. మీ రోగమేంటి చెప్పండి.

ఆగస్టీన్: అయ్యా! మీ మాటలు వింటుంటే నాకేదో భయంగా ఉంది. నొప్పి ఇంకా ఎక్కువ అవుతుంది.

డాక్టర్:ఏమి భయపడకండి. నేను కొంచెం ఎక్కువుగా వాగుతాను. అదే నా వీక్ నెస్. మీ భాధ చెప్పండి.

ఆగస్టీన్: డాక్టరుగారు, 20 సంవత్సరాలుగా కడుపులో నొప్పి, భాధ, తింటే అరగదు, పడుకుంటే నిద్రపట్టదు.

డాక్టర్: నీ కేసు చిటికెలో పట్టేశా. మీ కడుపులో పుండ్లున్నాయి. ఈ మందులు వాడి పదిరోజులకు రండి.       పులుపు, కారం ఎక్కువుగా తినండి.

ఆగస్టీన్: అదేంటండి. డాక్టర్లు పులుపు, కారం ఎక్కువుగా తీసుకోవద్దు అంటారు. మరి మీరేమో?

డాక్టర్: ఆహా.... ఆహా... అదే మన స్పెషాలిటీ ఇంతకాలం పులుపు, కారం తక్కువ తిన్నారు తగ్గిందా,          తగ్గలేదు... అందుకే ఎక్కువ తీసుకోండి. చిటికెలో పైకి ఎగిరిపోతారు.

ఆగస్టీన్: అలాగేనండి.. వెళ్లొస్తాను..

డాక్టర్: నా ఫీజు.. (next పేషెంట్)

***************************

దేవదానం: (దగ్గుతూ రావాలి) నమస్కారమండి డాక్టరుగారు (మరలా దగ్గాలి)

డాక్టర్: నమస్కారం. మీ రోగం ఏమిటి?

దేవదానం: (డాక్టరు గారి ముఖం మీద దగ్గుచూ) చూస్తున్నారుగా, 25 సంవత్సరాలనుండి దగ్గు, ఆయాసం,                        కూర్చుంటే లేవలేను, లెగిస్తే కూర్చోలేను.

డాక్టర్: సరే మీ రోగం అర్ధమైంధి. ఈ మందులు వాడండి, ఇక లేవవలసిన పనిలేకుండా చిటికెలో మాయం.

దేవదానం: ఏంటి నేనా?

డాక్టర్: కాదు మీ రోగం. ఇదిగో మీ చీటి ఇక మీరు వెళ్లిరండి. నా ఫీజు. (next patient)

************************

జఖరయ్య: (ఇద్దరు పిల్లలతో ప్రవేశం, పిల్లలు ఒళ్ళంతా గోకుకుంటూ ఉన్నట్టు నటించాలి)

              నమస్కారమండి డాక్టరు గారు..

డాక్టర్: నమస్కారం, నమస్కారం మీ బాధ ఏమిటో చెప్పండి.

జఖరయ్య: బాధ నాకు కాదండి, నా పిల్లలకు.. రెండు సంవత్సరాలనుండి ఈ పిల్లలకు ఒళ్ళంతా గజ్జంది,                   ఎప్పుడూ జ్వరాలే, ఇంటిలో ఆరోగ్యము లేదండీ..

డాక్టర్: జఖరయ్య గారు నేను అడిగే ప్రశ్నలకు సూటిగా జవాబు చెప్పండి.

జఖరయ్య: అలాగేనండి.

డాక్టర్: మీ వంశములో మీ ముత్తాత గారికి గజ్జి ఉందా?

జఖరయ్య: మా ముత్తాత నాకు తెలీదండి.

డాక్టర్: మీ తాత గారికి గజ్జి ఉందా?

జఖరయ్య: మా తాతగారు నాకు చెప్పలేదండి.

డాక్టర్: మీ నాన్నగారికి గజ్జి ఉందా?

జఖరయ్య: నేను చూడలేదండి.

డాక్టర్: మీకు గజ్జి ఉందా?

జఖరయ్య: నాకు గజ్జి ఉంటే మీ ఎదురుగా గోకి ఉండేవాడిని కదా?

డాక్టర్: ఆ... ఈ డాక్టర్ ఫటాఫట్ చాలా తెలివైనవాడు. మీ వంశములో గజ్జి లేకపోయినా ఈ గజ్జి ఎలా వచ్చిందో         చిటికెలో పట్టేసా.. అర్ధమైంధి. బంగాళాఖాతములో ఏర్పడిన వాయుగుండం ప్రభావం వలన ఈ గజ్జి    సోకి ఉంటుంది. సరే ఈ మందులు వాడి పదిరోజులు తర్వాత తీసుకురండి. ప్రతీరోజు మరుగుచున్న    వేడినీటితో స్నానము చేయించండి. పాతచర్మం ఊడి క్రొత్త చర్మం పడుతుంది. చిటికెలో ఫటాఫట్. ఇక         మీరు వెళ్లొచ్చు. Next patient రావాలి..

జఖరయ్య: ఇదేమి డాక్టర్రా బాబు. వీడి చేతుల్లో పడ్డాము. (అని వెళ్లిపోవును)

***************************

సమూయేలు: (త్రాగుబోతు త్రాగితూలుచూ) నమస్కారమండి బాబు దాటరు పట్టాపట్టాకారు.

డాక్టర్: నా పేరు పట్టకారు కాదయ్యా. (గొంతుక సవరించుకుని) డాక్టర్ ఫటాఫట్.

సమూయేలు: అదే లేవయ్యా, ఏదో పట్టకారు.

డాక్టర్: ఆ.. ఇంతకీ మీ రోగం ఏమిటి?

సమూయేలు: (పకపకనవ్వి) నాకు రోగం ఏమిటి? దేవుని మహాదయవలన నేను ఆరోగ్యంగానే ఉన్నాను,                       సంపాదిత్తున్నాను, త్రాగుతున్నాను. దేవుడు ఏమన్నాడు తినుము, త్రాగుము,                                  సుఖపడమన్నాడు. అయినా నా డబ్బుతో నేను త్రాగుతున్నాను. నన్ను ఎవడూ                                ఏమంటానికి సరిపోడు. నువ్వుకూడా సరిపోవు. ఒప్పుకుంటావా?

డాక్టర్: సరేబాబు ఒప్పుకుంటాను ఏంచేస్తా నా ఖర్మ! వీడేవడ్రా బాబు అందరి తలకాయలు నేను మారిస్తే, నా          తలకాయ మార్చడానికి వీడొచ్చాడు.

సమూయేలు: ఏంటి దాటర్ బాబు నీలో నువ్వే మాటాడేసుకుంటున్నావు. ఏటి నువ్వు కూడా తాగినావా? అయితే నువ్వు నేను ఒకటే.

డాక్టర్: నేను త్రాగలేదుగాని, ఇంతకీ నీకేం కావాలి?

సమూయేలు: దాటర్ బాబు మీరు అన్నీ రోగాలకు మందులిట్టారు, కాని ఇలాటి తాగుబోతోళ్ళకు మందులేమీ లేవంటారా? మా బతుకులు ఇలాగే తెల్లారిపోవాలా?

డాక్టర్: ఆ.. మందు ఉందయ్యా.. యూరియా, ఆమోపాస్ ప్రతీరోజు రెండు పూటలా నాలుగు గ్లాసులు కలుపుకుని త్రాగితే ఫటాఫట్.

సమూయేలు: అలాగా బాబు అయితే ఉప్పుడే వెళ్ళి తాగేత్తా! వత్తా బాబు.

డాక్టర్: అమ్మయ్యా గాలివాన వెలిసినట్టయింది. మిగిలిన పేషెంట్లు వెళ్లిపొంది రేపు చూస్తా...

*************** &&&&&&& *****************


Comments