క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 2వ రంగము

 

2వ రంగము

(ఒక గదిలో మాంత్రికుడు తనకు తగినట్లు గదిని మార్చుకోవాలి. నిప్పుల కుంపటిపై నిప్పులు ఉంచి సాంబ్రాణి చల్లి పొగవచ్చునట్లు చేయాలి.)

మాంత్రికుడు: ఓం.. రీమ్.. షటాషట్, ఫటాఫట్, ఓం.. రీమ్.. షటాషట్, ఫటాఫట్ (అని మంత్రాలు వల్లిస్తూ చేతితో సాంబ్రాణి తీసుకుని నిప్పులమీద వేయాలి) (ఇంతలో ఒక దయ్యము పట్టిన పిల్లవానిని తండ్రి మాంత్రికుని దగ్గరకు తీసుకుని రావాలి)

సుందరమ్మ: (పిల్లవాడు ఒళ్ళంతా విరుచుకుంటూ ఉండాలి) నమస్కారమండి మాంత్రికుడుగారు.

మాంత్రికుడు: నమస్కారము, నమస్కారము అలా కూర్చోండి. ఎవరు ఈ పిల్లవాడు ఏమైనది చెప్పండి?

సుందరమ్మ: అయ్యా ఇతడు నా కుమారుడు. ఇతనికి దయ్యముపట్టి సంవత్సరమైనది. ఒళ్ళంతా విరుచుకుంటాడు. రాత్రులు మంచము మీద నుండి క్రిందికి పడిపోతాడు. ఎన్నో ఆస్పత్రులు త్రిప్పాము. తంత్రాలు, మంత్రాలు వేయించాము లాభంలేదు. మీరేమైనా సహాయం చేయగలరా?

మాంత్రికుడు: (నవ్వుతూ) ఆ.. ఆ.. తప్పక సహాయం చేస్తాము. ఓం..రీం.. షటాషట్, ఫటాఫట్.. ఓం..రీం.. షటాషట్, ఫటాఫట్.. (కళ్ళు మూసుకుని) పలకవే కాళి పలకవే ఊ..ఊ.. ఏయ్ శంభారీ.. ఆగు.. ఓం..రీం.. షటాషట్, ఫటాఫట్...... మీ పేరు?

సుందరమ్మ: నా పేరు సుందరమ్మండి.

మాంత్రికుడు: సుందరమ్మగారు మీ అబ్బాయిని శంభారీ అనే దెయ్యం పట్టింది. దాన్ని వదలుగొట్టాలంటే పదివేలు ఖర్చవుతుంది. ఏమంటారు?

సుందరమ్మ: అయ్యా.. పేదవాణ్ణి.. చిన్న ఉద్యోగం. అంత పుచ్చుకోలేను, తమరు కోపపడనంటే ఒక మాట అయిదువేలు ఇస్తాను దెయ్యాన్ని పోగొట్టండి.

మాంత్రికుడు: సరే, పేదవాణ్ణి అంటున్నావు. నిన్ను చూస్తుంటే నాకెందుకో జాలిగా ఉంది. సరే మీరన్నట్లే ఫీజు చెల్లించండి. పూజలు ప్రారంభిస్తాం.

సుందరమ్మ: అయ్యా! ఇదిగో అయిదువేలు..

మాంత్రికుడు: (డబ్బు తీసుకొని సంచిలో పెట్టుకొనును) సరే మీరు కొంతసేపు బయట కూర్చోండి. మేము పూజలు జరిపి దెయ్యాన్ని పోగొడతాము.

సుందరమ్మ: అలాగేనంది, పిల్లవాడు జాగ్రత్తండి. ఒక్కగాన ఒక్క కుమారుడు. (అని చెబుతూ బయటకు వెళ్లిపోవును)

మాంత్రికుడు: మీకొచ్చిన భయమేమి లేదు. మీం జాగ్రత్తగా చూసుకుంటాం. ఓం.. రీం.. షటాషట్, ఫటాఫట్.. (పిల్లవానిని పరుండబెట్టి మంత్రాలు ఒకదానివెనకఒకటి వల్లిస్తూ సాంబ్రాణిని నిప్పులమీద వేస్తూ పెద్దపెద్దగా అరవాలి) ఏయ్! శంబారీ.. షటాషట్, ఫటాఫట్.. ఏయ్! శంబారీ.. షటాషట్, ఫటాఫట్.. ఏయ్ శంభారీ.. పో ఓం..రీం.. (కాసేపటికి పిల్లవాడు లేచి కూర్చుండును) సుందరమ్మగారు లోపలికిరండి. ఇదిగో మీ పిల్లవాడు దయ్యం పోయింది. ఈ తాయత్తు కట్టండి. ఇంటికి తీసుకువెళ్ళండి.

సుందరమ్మ: అయ్యా! దెయ్యం నిజంగా పోయిందంటారా? మళ్ళీ రాకుండా ఉంటాదా?

మాంత్రికుడు: (కోపంతో) ఏయ్! శంబారీ.. షటాషట్, ఫటాఫట్.. అనుమానమే పెనుభూతము, పెనుభూతమే పెద్దరోగం. మీ ఇల్లు సరిగాలేదు. ఆ ఇల్లు విడచి ఇంకో ఇంటిలో కాపురము పెట్టండి.

సుందరమ్మ: అయ్యా! కోపపడకండి వెళ్లొస్తాను. ఒకవేళ మళ్ళీ దెయ్యం వస్తే.....

మాంత్రికుడు: ఓం.. రీం.. ఓం.. రీం..షటాషట్, ఫటాఫట్.. ఇంటికి వెళ్ళి పదివేలు తెచ్చుకోండి.

 

*******************************************************

Comments