క్రిస్మస్ కిరణాలు - క్రిస్మస్ నాటిక - 4వ రంగము

 

4వ రంగము

(ఉజ్జీవ కూటములు జరుగుచున్న స్థలం, పాస్టరుగారు వేదిక మీద నిలువబడి ప్రసంగిస్తూ ఉంటారు. కూటం అయిపోయింది. ఒక్కొక్కరి సమస్యలు పాస్టరుగారికి రొగులు చెబుతారు) (పాపమువలన వచ్చు రోగములు గూర్చి భోదించాలి)

పాస్టరుగారు: మీ పేరు?

ఆగస్టీన్: నా పేరు ఆగస్టీన్ అండి.

పాస్టరుగారు: మీ సమస్య ఏమిటి?

ఆగస్టీన్: అయ్యా! నేను గత 25 సం.లుగా కడుపులో అల్సరుతో బాధపడుచున్నాను. నేను తిరగని ఆస్పత్రి లేదు, వాడని మందులు లేవు. ప్రార్ధన చేయించుకోని బోధకులు లేరు. అన్ని విధాల ప్రయత్నించాను, కానీ ఫలితం సూన్యం. నా సమస్యకు పరిష్కారం చెబుతారా?

పాస్టర్: అవును చెబుతాను, కానీ నేను అడిగే ప్రశ్నలన్నిటికి సరియైన జవాబు చెప్పాలి.

ఆగస్టీన్: అలాగే చెబుతానండి.

పాస్టరుగారు: నీ గ్రామములో నీకు ఎవరైనా శత్రువులున్నారా?

ఆగస్టీన్: అయ్యా! శత్రువులకు కడుపునొప్పికి సంబంధం ఏమున్నదండి? మొన్న ఓ ప్రార్ధన కూటానికి వెళ్ళాను. ఆ పాస్టరమ్మ గారు నన్ను ఇలాంటి ప్రశ్నలు ఏమీ వేయలేదు. శిలువ గుర్తు వేసి ప్రార్ధన చేశారు.

పాస్టర్ గారు: మరి రోగం తగ్గిందా?

ఆగస్టీన్: తగ్గలేదండీ.. సరికదా ఇంకా ఎక్కువయ్యింది..

పాస్టర్ గారు: చూడండి ఆగస్టీన్ గారు, పాపమును ఒప్పించకుండా ప్రార్ధనలు చేసినంత మాత్రాన రోగాలు తగ్గవు.      దేవుని వాక్యము ఇలా చెబుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచి పెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము, నీ యెముకలకు శక్తి దొరుకుతుంది. సామె 3:7 లో ఉంది. సరే ఇంతకీ శత్రువులున్నారా?

ఆగస్టీన్:  ఒక్కరేమిటి? నా గ్రామములోని వారంతా నాకు శత్రువులే..

పాస్టర్ గారు: నీవు క్రైస్తవుడివా? చర్చికి వెళ్ళే అలవాటు ఉందా?

ఆగస్టీన్: అవునండి కిస్మిస్ పండక్కి, ఈష్టర్ పండక్కి, గుడ్ ఫ్రైడేకి , జనవరి ఫస్టుకి, రొట్టె ద్రాక్షారసము ఇచ్చునప్పుడు చర్చికి వెళతాను. అంతే కాదండోయ్ ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకొనేటప్పుడు బొడ్డులో కత్తి పెట్టుకుని రొట్టె ద్రాక్షారసము కూడా తీసుకుంటాను.

పాస్టర్ గారు: ఇదేమి క్రైస్తవుడివయ్యా! కత్తి పట్టుకొనువాడు కత్తితోనే మరణిస్తాడని ప్రభువు చెప్పలేదా? ఆగస్టీన్ గారు మీ రోగం తగ్గాలంటే నేను చెప్పినట్లు చేయండి.

ఆగస్టీన్: అయ్యా! ఏమి చేయమంటారో చెప్పండి.

పాస్టర్ గారు: మీ చేతిలో ఉన్న కత్తిని పడవేసి ఇప్పుడే వెళ్ళి మీ శత్రువులతో సమాధానపడండి. మీ రోగం మాయమౌతుంది.

ఆగస్టీన్: (చేతిలో ఉన్న కత్తిని పడవేసి) అయ్యా! మీరు చెప్పినట్లు చేస్తాను. ఈ కత్తితో నాకు పనిలేదు. ఇప్పుడే వెళ్ళి నేను ఎవరిని చంపాలనుకున్నానో వారి కాళ్ళు పట్టుకుని క్షమాపణ అడుగుతాను.

పాస్టర్ గారు: సరే వెళ్లిరండి. మీ పేరు?

జఖరయ్య: నా పేరు జఖరయ్యండి.

పాస్టర్ గారు: మీ సమస్య ఏమిటి?

జఖరయ్య: అయ్యా! రెండు సంవత్సరాలనుండి నా పిల్లలకు ఒళ్ళంతా గజ్జి, తరచూ జ్వరాలు, బలహీనతలు, రోగాలు, ఇంటిలో ఆరోగ్యము లేదండీ. కారణం ఏమిటో తెలీదండి. ఎన్నో ఆసుపత్రులు త్రిప్పాను, మందులు వాడాను. లాభం లేకపోయింది.

పాస్టర్ గారు: జఖరయ్య గారు మీరు ఏమి పని చేస్తారు?

జఖరయ్య: అయ్యా నేను ఒక దొరగారి సంస్థలో వంట మనిషిగా పనిచేస్తాను. వారు నెలనెలా నాకు జీతం కూడా ఇస్తారు.

పాస్టర్ గారు: జఖరయ్య గారు నేను అడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పండి.

జఖరయ్య: అలాగే చెబుతానండి.

పాస్టర్ గారు: మీరు పనిచేసే సంస్థ నుండి దొరగారికి తెలియకుండా ఏవైనా దొంగ వస్తువులు తెచ్చుకున్నారా?

జఖరయ్య: అవునండి దొరగారికి తెలియకుండా బియ్యము, కందిపప్పు, పాలపొడి, నూనె డబ్బాలు, కుంకుళ్ళు, సబ్బులు కూడా తెచ్చి మా పిల్లలకు స్నానం చేయించానండి. తప్పంటారా?

పాస్టర్ గారు: ముమ్మాటికి తప్పే. దేవుడు న్యాయముగా సంపాదించుకుని తినమన్నారు. అన్యాయమైన సంపాదన మీ ఇంటిలోనికి వచ్చినందువలనే ఈ రోగాలు. ఇప్పుడే వెళ్ళి దొంగిలించిన వస్తువులు తిరిగి ఇచ్చివేసి దొరగారిని క్షమాపణ అడగండి. మీ పిల్లలు బాగౌతారు.

జఖరయ్య: అయ్యా! ఆ వస్తువులన్నీ వాడేసుకున్నాము కదా. అవి ఎలా తిరిగి ఇవ్వాలి?

పాస్టర్ గారు: జఖరయ్య గారు ఆ వస్తువుల ఖరీదు ఎంతో వెలకట్టి ఆ డబ్బు తిరిగి ఇవ్వండి.

జఖరయ్య: అలాగేనండి. ఇప్పుడే వెళ్ళి మీరు చెప్పినట్లు చేస్తాను.

పాస్టర్ గారు: మీ పేరు చెప్పండి.

సుందరమ్మ: నా పేరు సుందరమ్మండి.

పాస్టర్ గారు:  మీ సమస్య చెప్పండి.

సుందరమ్మ: అయ్యా! ఏమి చెప్పమంటారు? గత నాలుగు సంవత్సరాలుగా నా కూతుర్ని దయ్యం పట్టుకుని పీడిస్తుంది. రాత్రులు నిద్ర ఉండదు. నా ఇంటిలో నెమ్మదిలేదు, సమాధానం లేదు. అంతే కాదండి రాత్రులు ఈ అమ్మాయి మంచం మీద నుండి క్రింద పడిపోతుంది. ఇదిగో ఒళ్ళంతా గాయాలు. కారణం ఏమిటో తెలియడం లేదండీ..

పాస్టర్ గారు: సుందరమ్మ గారు నేను అడిగే ప్రశ్నలకు సత్యం చెబుతారా?

సుందరమ్మ: అయ్యా! అబద్దం చెప్పను, సత్యమే చెబుతాను.

పాస్టర్ గారు: సుందరమ్మ గారు మీ అమ్మాయి పడుకునే మంచం ఎక్కడిది? నిజం చెప్పండి.

సుందరమ్మ: (కొద్దిసేపు ఆలోచించి భయముతో) ఆ.. ఆ..అదా.... అదీ.. అదీ.. అయినా దాని సంగతి ఎందుకులేండి.

పాస్టర్ గారు: ఎందుకు భయపడుతున్నారు? నిజం చెప్పండి.

సుందరమ్మ: అయ్యా నేను ఒక గవర్నమెంట్ ఆసుపత్రిలో హెడ్ నర్సుగా పనిచేస్తున్నాను. మా ఆసుపత్రిలో ఒక పేషెంట్ చనిపోతే ఆ మంచాన్ని ఒక ప్రక్కన పెట్టేశారు. అది డాక్టరు గారికి తెలీకుండా దొంగచాటుగా ఇంటికి తెచ్చుకుని వాడుకుంటున్నానండి. అంతే ఆప్పటినుండి దయ్యం మా ఇంటిలో దాపరించింది.

పాస్టర్ గారు: సత్యాన్ని ఒప్పుకున్నారు మీరు ధన్యులు. ఆ దెయ్యం మీ అమ్మాయిని విడిచిపోవాలంటే నేను చెప్పినట్లు చేయండి. మీ ఇంటిలో ఉన్న ఆ ఇనప మంచాన్ని తీసుకుని వెళ్ళి సూపర్ నెంట్ గారిని  క్షమాపణ అడిగి ఇచ్చేసిరండి.

సుందరమ్మ: అలాగే అయ్యగారు ఇప్పుడే వెళ్ళి మంచాన్ని ఇచ్చేసి క్షమాపణ అడుగుతాను. వస్తానండి (అని వెళ్లిపోవాలి)

పాస్టర్ గారు: మీ పేరు?

సమూయేలు: నా పేరు సమూయేలండి.

పాస్టర్ గారు: మీ సమస్య చెప్పండి?

సమూయేలు: పాస్టరు గారు నాకు ఒకే ఒక భార్య. నలుగురే నలుగురు పిల్లలండి. నాకు నా భార్యకు సమాధానం లేదండీ. ప్రతీ రోజు నా భార్య నోరాడిస్తాదండి. నేను నా చెయ్యి ఆడిస్తానండి. చేసిన పాపం చెప్పుకుంటే పోతాదంటారు. నాకు కొద్దిగా మందు అలవాటు ఉందండి. అది మానుకోవాలని శానా ప్రయత్నాలు చేసానండి. అయినా బాగుపడలేదు. మీరేదైనా మార్గం చెబుతారేమోనని మీ దగ్గరకొచ్చాను.

పాస్టర్ గారు: సమూయేలు గారు తప్పక చెబుతాను జాగ్రత్తగా వినండి.

సమూయేలు: అయినా పాస్టరుగారు నాకు తెలీక అడుగుతున్నా? దేవుడు తాటిచెట్టు ఎందుకు పుట్టించాడు? పుగాకు ఎందుకు ఇచ్చాడు? మీ పాటర్లంతా కల్లు, సారాయిలు త్రాక్కూడదు, సినిమాలు సూడకూడదు, చుట్ట, సిగరెట్లు త్రాక్కూడదంటారు. అయితే దేవుడు  అవి మనకెందుకిచ్చాడు? అది నాకు తెలియాలి.

పాస్టర్ గారు: చూడండి సమూయేలు గారు. దేవుడు భూమి మీద ఇచ్చినవన్నీ మనము అనుభవించడానికి కాదు. భూమి మీద మంచి, చెడులు ఉన్నాయి. ఏది మంచిదో అది అనుభవించాలి. ఏది చెడ్డదో దానికి దూరముగా ఉండాలి. దేవుని వాక్యము తప్పుగా అర్ధము చేసుకొని మీ జీవితాన్ని త్రాగుడుతో నాశనము చేసుకొనవద్దు. త్రాగుబోతులకు పరలోకము లేదు. త్రాగుడు వలన మీ బిడ్డలు దరిద్రులైపోతారు. మీ ఇంటిలో నెమ్మది, సమాధానం ఉండదు. ఇప్పుడే మీ ఇంటికి వెళ్ళి మీ భార్యను క్షమాపణ అడిగి పాపములకొరకు పశ్చాతాపపడండి. ప్రభువు మిమ్ములను ముట్టుకుని బాగుచేస్తారు.

సమూయేలు: పాస్టరు గారు.... పాపములు ఒప్పుకోమంటే ఒప్పుకుంటాను, కానీ నా భార్యను క్షమాపణ అడగడం నావల్లకాదు.

పాస్టర్ గారు: సమూయేలు గారు ఏమైనది?

సమూయేలు: నేను మగమహారాజును, దాన్ని చమాపన అడగడమేంటి?

పాస్టర్ గారు: అలాగ అనకండి. తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. తన్నుతాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును. మీరు తగ్గించుకొంటే ప్రభువు మిమ్ములను దీవిస్తారు. దయచేసి నామాట వినండి. వెళ్ళి రేపు కూటానికి రండి.

సమూయేలు: సరే! మీ మాట ప్రకారము తగ్గించుకుంటాను. రేపు కలుత్తాను.

 

(తెర)

*******************************************************************************************************

Comments