దేవునిని ఆశ్రయించుట (నాటిక)

 

దేవునిని ఆశ్రయించుట (నాటిక)

పాత్రలు:

1.    అమ్మగారు                                     

2.   సీతయ్య (పనివాడు)                        

3.   యేసయ్య      

4.   హీరోయిన్ సమంతా 

5.   డాక్టర్

6.   MLA

7.   సేటు గారు (వడ్డీ వ్యాపారి)

8.   అమ్మగారి అన్నయ్య

(తెరతీయగానే లేదా లైట్స్ వేయగానే స్టేజీ మీద 6 కుర్చీలు వరుసగా వేసి ముందుగానే ఉండాలి. లైట్స్ వేయగానే పనిమనిషి ప్రవేశం)

సీతయ్య: (టవల్ తో కుర్చీలు తుడుస్తున్నట్టు నటిస్తూ) అమ్మమ్మమ్మా పొద్దున్నుంచి ఒకటే పని జీతం తక్కువ, పని ఎక్కువ. చానా అనిసిపోయినాను. కొంచెంసేపు ఒక కునికేసుకుందాం. (అని కుర్చీలో కూర్చొని                                                          నిద్రపోయినట్లు నటించాలి)

అమ్మగారు: (చేతిలో ఫోన్ పట్టుకుని) అమ్మో! చాలా టైమ్ అయిపోయింది. అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాము. చాలా పనులున్నాయి. ఫ్రండ్స్ ని పిలవాలా... షాపింగ్ చేయాలి.. ఇల్లు క్లీన్ చేయాలా... అవును ఇంతకీ సీతయ్య ఏం చేస్తున్నాడు? ఆరేయ్!! సీతయ్య పనిచేయకుండ నిద్రపోతున్నావా?

సీతయ్య: (ఉలిక్కిపడిలేచి) అమ్మగారు పని ఎక్కువై కునుకు వచ్చిందమ్మ.. నన్ను చమించండి..

అమ్మగారు: వెళ్ళి ముఖం కడుక్కుని కాఫీ తీసుకురా!

సీతాలు: (కప్పు సాసరతో కాఫీ తెచ్చినట్లు నటించాలి) అమ్మగారండీ! కాఫీ ఇదిగోండి!!

అమ్మగారు: (కాఫీ తాగినట్లు నటించి కప్పు సాసరు పనివాడి చేతికివ్వాలి) ఏంటి ఆయనగారు డబ్బు వేస్తానన్నారు. ఇంకా వేయలేదేమిటి? (అని ఫోన్ చూస్తూ మాట్లాడాలి) సీతయ్య మీ అయ్యగారు డబ్బులేస్తానన్నారు. ఇంకా వేయలేదు. నేను త్వరగా షాపింగ్ చేయాలా...

సీతయ్య: అమ్మగారండీ నాకొక సందేహామండి...

అమ్మగారు: ఏంటి చెప్పు సీతయ్య?

సీతయ్య: ఏమీ లేదు అమ్మగారు. అమ్మాయి గారి పెళ్లికదండీ నాకు ఎంతపెట్టి పట్టు పంచె కొంటారమ్మ గారు?

అమ్మగారు: నా ఇంటిలో 30 సంవత్సరాలనుండి నమ్మకముగా పనిచేస్తున్నావు.. 300 వందలు పెట్టి కొననా ఏంటి?

సీతయ్య: ఎక్కువైపోతాదేమో అమ్మగారు.

అమ్మగారు: 150లో కొనమంటావా?

సీతయ్య: మీ ఇట్టమమ్మగారు...

అమ్మగారు: హలో! ఆ... నేనేనండి.. నాకు తెలుసండి ప్రతీ సంవత్సరము బిజినెస్ లో మనకే షేర్స్ వస్తాయి.. ఆ... అలాగా కంపెనీలో నష్టమొచ్చిందా? ఇప్పుడు డబ్బులు దొరకవా? అయ్యో! ఇప్పుడెలాగా? నా కూతురు పెళ్లి ఎలా చేయాలి? అయ్యో! ప్రభువా! (దిగులుగా కూర్చీలో కూర్చోవాలి)

సీతయ్య: అమ్మగారండీ ఇప్పటివరకు సంతోషంగానే ఉన్నారు. ఇంతలోనే ఇలా దిగాలు పడిపోయారు ఏం జరిగిందమ్మా?

అమ్మగారు: (విసుగ్గా) సీతయ్య నీతో చెబితే నువ్వు ఆరుస్తావా? తీరుస్తావా? మన బిజినెస్ లో నష్టమొచ్చిందంటా... డబ్బులు దొరకవని మీ అయ్యగారు ఫోన్ చేశారు. ఇప్పుడు అమ్మాయి పెళ్లి ఎలా చేయాలని నా చింత?

సీతయ్య: అమ్మగారు నన్నోమాట చెప్పమంటారా? చెప్పమంటే చెబుతాను.

అమ్మగారు: చెప్పు సీతమ్మ...

సీతయ్య: ఏమీలేదమ్మ మీకు తెలిసిన డబ్బున్న దాటర్లు, ఇంజనీర్లు, మంత్రులు, యాటర్లు, సింగర్లు, డబ్బున్న మీ బంధువులందరినీ పిలుద్దాం, వాళ్ళు ఇచ్చే డబ్బుతో మన అమ్మాయి పెళ్లి ఘనంగా చేసేద్దాం.

అమ్మగారు: (ఆశ్చర్యంగా) సీతయ్య ఇప్పటివరకు నీవు ఏదో అనుకున్నాను. భలే ఐడియా ఇచ్చావు. నువ్వు చెప్పినట్లేఈ రోజే వాళ్ళను పిలిచేద్దాం ఇల్లంతా రెడీ చెయ్యి. యేసయ్యా నాకు సహాయము చేయవా?

సీతయ్య: అలాగే అమ్మగారు.

అమ్మగారు: సరే వెళ్ళు...

సీతయ్య: (డోరు కొట్టినట్లు శబ్ధము) (తలుపు తీసినట్లుగా నటిస్తూ) ఆ..... వస్తున్నానండి.. అమ్మో మా ఇంటికి యేసుబాబు వచ్చారు.. అమ్మగారండి మన ఇంటికి యేసుబాబు వచ్చారండి..

అమ్మగారు: ఏంటి సీతయ్య మన ఇంటికి యేసు ప్రభువు వచ్చారా? సరే ఉండు లోపలికి పిలుస్తాను. యేసయ్యా లోపలికి రండి. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా వందనాలు యేసయ్య. ఇదిగో ఈ మొదటి స్థానంలో కూర్చోండి యేసయ్య. మీరు ఇక్కడే కూర్చోండి. నాకు చాలా పనులున్నాయి.. నేను మళ్ళీ వస్తాను..

సీతయ్య: ఓరి నాయనో! యేసుబాబు ఎంత అందంగా ఉన్నాడో... (మరలా డోర్ కొట్టిన శబ్దము విని తలుపు తీసినట్లుగా నటించాలి) వచ్చేతున్న, వచ్చేతున్న అమ్మగారండి, అమ్మగారండి.. సినిమాల్లో డాన్స్ లు  వేత్తారు కదా ఆవిడ గారు వచ్చారండి..

అమ్మగారు: ఎవరు? హీరోయిన్ సమంతా వచ్చిందా? హాయ్ సమంతా ఎలా ఉన్నావు?

సమంతా: ఐయామ్ ఫైన్... నీవు ఎలా ఉన్నావు?

అమ్మగారు: నేను కూడా బాగానే ఉన్నాను... రారా... లోపలికి రా ఇలా వచ్చి ఆ రెండవ స్థానంలో కూర్చో...

సమంతా: నేను షూటింగులు మానుకుని వస్తే నాకు రెండో స్థానమా? నాకు మొదటి స్థానం ఇస్తేనే ఉంటా లేకపోతే వెళ్లిపోతా...!

అమ్మగారు: (తన మనస్సులో) అమ్మో ఈమె వెళ్లిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు.

అమ్మగారు: ఆగు ఆగు వెళ్లకు నీకు మొదటి స్థానం ఇస్తా! యేసయ్యా మీరు రెండవ స్థానములో కూర్చోండి యేసయ్యా. (యేసు రెండవ కుర్చీలో కూర్చుండును) సీతయ్య నా ఫ్రెండ్ హీరోయిన్ వచ్చింది ఏమి కావాలో చూడు..

సీతయ్య: (కప్పు సాసరుతో కాఫీ తెచ్చి ఇవ్వాలి) ఈరోయిన్ గారు కాఫీ ఇదిగోండి..

సమంతా: అలాగే!

అమ్మగారు: (తలుపుకొట్టిన శబ్దము) సీతయ్య ఎవరో తలుపు కొడుతున్నారు తలుపు తీయి...

సీతయ్య: అలాగే అమ్మగారండి. అమ్మగారండి మన పామిలీ డాటర్ గారు వచ్చారండి...

అమ్మగారు: మన పేమిలీ ఏమిటి రా... నా ఫ్యామిలీ డాక్టరు గారు... హాయ్! డాక్టరు గారు ఎలా ఉన్నారు?

డాక్టర్: హాయ్! విజయ How are You?

అమ్మగారు: నేను బాగానే ఉన్నాను. పిలిచిన వెంటనే వచ్చినందుకు చాలా థాంక్స్ డాక్టరు గారు. డాక్టరు ఈ మూడో స్థానంలో కూర్చోండి..

డాక్టరు: ఏంటి నేను మూడో స్థానంలో కూర్చోవడమా? నేను ఎంత పెద్ద డాక్టర్ నో తెలుసా? రోజుకు 200 మంది పేషెంట్లను చూస్తాను. 5,6 ఆపరేషన్లు చేస్తాను. నాకు మూడో స్థానమా? నాకు రెండో స్థానం ఇస్తేనే కూర్చుంటా లేకపోతే వెళ్లిపోతాను.

అమ్మగారు: ఆగండి, ఆగండి... అమ్మో ఈమె వెళ్లిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు? యేసయ్యను మాటిమాటికి అడిగితే ఏమి బాగుంటాది. అయినా మన యేసయ్యే కదా ఒక మాట అడిగేద్దాం. యేసయ్యా!..... (యేసయ్య మూడో కుర్చీలోకి వెళ్ళాలి) సీతయ్య డాక్టరు గారికి ఏమి కావాలో చూసుకో...

సీతయ్య: అలాగే అమ్మగారు (కాఫీ తెచ్చి డాక్టరు గారికి ఇవ్వాలి) దాటరు గారు కాఫీ ఇదిగోండి..

అమ్మగారు: సీతయ్య ఎవరో డోర్ కొడుతున్నారు చూడు...

సీతయ్య: అలాగే అమ్మగారు (వెళ్ళి తలుపు తీసినట్లు నటించాలి) అమ్మగారండీ అదే అయిదు యేళ్లకొకమారు వచ్చి ఓట్లు అడుక్కుని తర్వాత కనబడకుండా పోతారు కదా ఆయన వచ్చారండి...

అమ్మగారు: ఓ! ఎమ్మెల్యే గారు వచ్చారా? హాయ్ ఎమ్మెల్యే గారు ఎలా ఉన్నారు?

MLA: మేము బాగానే ఉన్నాము విజయ మీరు ఎలా ఉన్నారు?

అమ్మగారు: మేము కూడా బాగానే ఉన్నాము సార్! MLA గారు ఈ నాలుగో స్థానంలో కూర్చోండి...

MLA: ఏంటి? విజయ నేను ముఖ్యమైన మీటింగులు మానుకుని ప్రయాసపడి ఇక్కడికి వస్తే నాకు నాలుగో స్థానం ఇస్తావా? నాకు మూడో స్థానం ఇస్తే నేను కూర్చుంటాను లేకపోతే వెళ్లిపోతాను...

అమ్మగారు: ఆ... ఆ... వెళ్ళొద్దు ఆగండి.. ఈయన గారు వెళ్లిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు. యేసయ్య!! (యేసయ్య నాలుగో కుర్చీలోనికి వెళ్ళాలి) సీతయ్య MLA గారికి ఏమి కావాలో చూసుకో...

సీతయ్య: అలాగే అమ్మగారు. (కాఫీ తెచ్చి MLA గారికి ఇవ్వాలి) (డోర్ కొట్టిన శబ్దము విని) ఆ... వత్తున్నా, వత్తున్నా అమ్మగారు ఎవరొచ్చారో చూసారా? మీరు అప్పుడప్పుడు వడ్డీకి డబ్బులు తెచ్చుకుంటారు కదా ఆ సేటు గారు వచ్చారండి...

అమ్మగారు: వడ్డీ వ్యాపారి సేటు గారా? ఆ రండి రండి పిలిచిన వెంటనే వచ్చినందుకు మీకు చాలా థాంక్స్ అయ్యగారు. ఇలా అయిదో స్థానంలో కూర్చోండి..

సేటుగారు: ఏంటి నేను ఈ పట్టణములో గొప్ప వడ్డీ వ్యాపారిని, నేను అయిదో స్థానంలో కూర్చోవడమా? నాకు నాలుగో స్థానం ఇస్తేనే కూర్చుంటాను లేకపోతే వెళ్లిపోతాను...

అమ్మగారు: ఆ... ఆ... ఆగండి (మనసులో) ఈయన గారు వెళ్లిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు?

అమ్మగారు: (యేసువైపు చూస్తూ) యేసయ్య!! (యేసయ్య అయిదో కుర్చీలోనికి వెళ్ళాలి) సీతయ్య! సేటు గారు వచ్చారు, కాఫీ తెచ్చి ఇయ్యి...

సీతయ్య: అలాగే అమ్మగారండి (అని కాఫీ తెచ్చి ఇవ్వాలి) (మరలా డోర్ శబ్దం) ఆ... వత్తున్నానండి... పొద్దుట్నుంచి వత్తానే ఉన్నారు.. (డోర్ తీసినట్లు నటించాలి) అమ్మగారండీ ఎవరొచ్చారో చూసారా? మీ అన్నయ్యగారండీ...

అమ్మగారు: ఏంటి మా అన్నయ్య వచ్చారా? చాలా సంతోషం... అన్నయ్య , వదిన, పిల్లలు ఎలా ఉన్నారు? అంతా కులాసానా?

అన్నయ్య: దేవుని దయవలన అంతా క్షేమమేనమ్మా! ఏంటి అర్జంటుగా రమ్మని పిలిచావు? సమస్య ఏంటి?

అమ్మగారు: అన్నయ్య అంతా చెబుతాను. ముందు ఈ ఆరో స్థానములో కూర్చోండి...

అన్నయ్య: ఏంటి చెల్లమ్మా Hyderabad లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం సెలవు పెట్టి ఇంత దూరం వస్తే నాకు ఆరో స్థానం ఇస్తావా? నేను పెద్దవాడిననే గౌరవము కూడా లేదా? నాకు అయిదో స్థానం ఇస్తే ఉంటాను లేకపోతే వెళ్లిపోతాను...

అమ్మగారు: అయ్యయ్యో మా అన్నయ్య వెళ్లిపోతే నాకు ఎవరు సహాయం చేస్తారు.. అన్నయ్య ఉండండి.. [యేసయ్య వైపు చూస్తూ] యేసయ్య! [యేసయ్య 6వ కుర్చీలోనికి వెళ్ళాలి] సీతయ్య మా అన్నయ్యకు మంచి కాఫీ ఒకటి తెచ్చిపెట్టు...

సీతయ్య: అన్నయ్య గారికి మంచి కాఫీ అంట... ఈళ్లందరికి ఇచ్చినాయి చెడ్డ కాఫీలేమో? (అని కాఫీ తెచ్చి ఇవ్వాలి)

అమ్మగారు: నేను పిలిచిన వారందరూ వచ్చేసినట్లు ఉన్నారు.. నేను పిలిచిన వెంటనే మీరందరూ వచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను..

యేసయ్య: అమ్మా, అమ్మా...

అమ్మగారు: యేసయ్య ఆగండి యేసయ్య.. మా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నామని మీ అందరికి తెలుసు, అయితే ఇంతలోనే మా బిజినెస్ లో లాసొచ్చి చాలా నష్టపోయాము...

యేసయ్య: అమ్మా!!

అమ్మగారు: ఆగండేసయ్య! మాట్లాడుతున్నాను గదా? మీ మీద నేను ఎంతో ఆశ పెట్టుకొనియున్నాను.. సమంతా...

సమంతా: సారీ! విజయ నాకున్న ఎమౌంట్ అంతా మూవీలో పెట్టేశాను.. నా దగ్గర ఏమీ లేదు... సో సారీ (అని వెళ్లిపోవును)

అమ్మగారు: డాక్టరు గారు మీరైనా...

డాక్టర్: సారీ విజయ... నేను క్రొత్తగా హాస్పిటల్ కడుతున్నాను... చాలా ఖర్చులున్నాయి... నన్ను క్షమించు... (అని వెళ్లిపోవును)

అమ్మగారు: MLA గారు మీరైనా...

MLA: సారీ విజయ డబ్బంతా ఎలక్షన్ లో ఖర్చు అయిపోయింది... ఈ సమయములో నేను నీకు సహాయం చేయలేకపోవుచున్నాను నన్ను క్షమించు...

అమ్మగారు: సేటు గారు (వడ్డీ వ్యాపారి)....

సేటు గారు: సారీ, మేడమ్ మీకు 50 లక్షలు ఇవ్వాలంటే ఇంటి డాక్యుమెంట్స్ గాని, బంగారము గాని మాకు ఇవ్వాలి... లేకపోతే అంత పెద్ద అమౌంట్ మీకు ఊరకనే ఇవ్వలేము.. వస్తాము... (అని వెళ్లిపోవును)

అమ్మగారు: అన్నయ్య మీరైనా నన్ను ఆదుకుంటారా?

అన్నయ్య: సారీ, చెల్లమ్మా! ఏదో 5 వేలు, 10 వేలు అంటే సాయం చేయగలను గాని అంత పెద్ద ఎమౌంట్ నేనెలా చూడగలను? నా కుటుంబానికి ఎన్నో ఖర్చులు ఉన్నాయి.. నన్ను క్షమించు తల్లీ!!

అమ్మగారు: అన్నయ్యా!! అన్నయ్యా!! (అని దిగులుగా కుర్చీలో కూర్చుని ఉండును)

సీతయ్య: అమ్మగారండీ... ఏంటి దిగులుగా ఉన్నారు? ఏం జరిగింది?

అమ్మగారు: ఏం చెప్పమంటావు రా సీతయ్య... నా కూతురు పెళ్లికొరకు ఎవరైతే సహాయం చేస్తారని ఆశపెట్టుకున్నానో వాళ్ళందరూ నీరుగార్చి వెళ్ళిపోయారు.. ఇప్పుడు ఏం చేయాలో నాకు తోచటము లేదు...

సీతయ్య: అమ్మగారండీ!! నన్ను ఒక మాట చెప్పమంటారా? సాయం చేయటానికి ముందుగా యేసుబాబుని పిలిచారు.. ఈళ్లందరిని చూసుకుని యేసుబాబుని ప్రక్కకు తోసేశారు.. యేసుబాబు దుఖపడుతూ ఎల్లిపోయారు.. ఇప్పుడైనా యేసుబాబునీ అడగండి.. ఆయన తప్పక సాయం చేత్తారు...

అమ్మగారు: సీతయ్య ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అడగాను? ఆయన నన్ను క్షమిస్తారా?

సీతయ్య: యేసుబాబు చమించే దేవుడని మీరీ చెప్పారు కదా! అడగండి ఆయన సాయం చేత్తారు. (అని వెళ్లిపోవును)

అమ్మగారు: (మోకరించి ప్రార్ధన చేయాలి) యేసయ్యా!! నేను నిన్ను నిర్లక్ష్యము చేసి చాలా తప్పు చేసాను, అడిగిన వెంటనే సహాయం చేసే నీ మీద అనుకోకుండా, మనుష్యుల మీద అనుకున్నాను. వాళ్ళందరూ నన్ను మోసం చేసి వెళ్లిపోయారు.. మీరైనా సహాయం చేస్తారా?

యేసయ్య: (అమ్మగారి తల మీద కుడి చెయ్యి పెట్టి ఇలా చెప్పాలి) అమ్మా! విజయ నేనున్నానమ్మా భయపడకు నీ బిడ్డ పెళ్లి నేనే ఘనముగా జరిపిస్తాను.. నేను నీ కొరకు నా ప్రాణమే పెట్టాను.. ఈ చిన్న సహాయం నేను చేయలేనా? ఇకనైనా మనుష్యుల మీద ఆనుకొనక నీ కొరకు ప్రాణమిచ్చిన నా మీదనే ఆనుకోతల్లి.. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను ధైర్యముగా ఉండు...

అమ్మగారు: యేసయ్యా! వందనాలేసయ్యా,  వందనాలేసయ్యా, వందనాలేసయ్యా! ఆమేన్!!

సీతయ్య: అమ్మగారండి! ఏంటి ఇంత సంతోషంగా ఉన్నారు?

అమ్మగారు: సీతయ్య, ఇలా కూర్చో సీతయ్య యేసయ్య నాతో మాట్లాడినారు...

సీతయ్య: అమ్మో, అమ్మో యేసుబాబు మీతో మాట్లాడేశారా?

అమ్మగారు: ఔను, సీతయ్య.... యేసయ్య నీవు భయపడొద్దు... నీ కుమార్తె పెళ్లి నేను ఘనంగా జరిపిస్తానని వాగ్దానము చేశారు సీతయ్య...

సీతయ్య: యేసుబాబు ఎంత మంచి దేవుడో!!!

అమ్మగారు: అవును సీతయ్య... నాకు చాలా సంతోషంగా ఉంది.. (ఇంతలో ఫోన్ రింగ్ అవుతుంది) హలో నేనేనండి... అవునా నిజమా? చాలా థాంక్స్ అంది... సీతయ్య బిజినెస్ లో మన షేర్స్ అన్నీ పోయాయి అనుకున్నాము కదా! అవన్నీ వచ్చేసాయంట... దేవా నీకు వందనాలు...

సీతయ్య: అమ్మగారండి ఈ శుభ సంధర్బంలో నేను కూడా యేసుబాబును నమ్ముకుని మీతో పాటు ఆదివారం ప్రార్ధనకి వత్తానండి.. ఆదివారం నాకు సెలవు ఇవ్వాలండి...

అమ్మగారు: అలాగే సీతయ్య ఆదివారం నీకు సెలవు.. సీతయ్య నేను చాలా పెద్ద తప్పు చేసాను.. ఆదివారం దేవుని సన్నిధిని మానుకుని, స్నేహితులతో , బంధువులతో, క్లబ్బులని, ఫబ్ లని, విందులని, వినోదములని తిరుగుచూ మనుష్యులను సంతోషపెట్టాను.. దేవునిని దుఖపరిచాను.. ఇకనుండి ప్రతీ ఆదివారం మన ఆనందరావు అయ్యగారి చర్చికి వెళదాము...   (లైట్స్ ఆఫ్)

 

THE END

 

 

Comments